NENINTHE

Just the way I am

పాటతో నా ప్రయాణం

Jazz singer and band performing live before an attentive audience

పాట… పాట నా జీవితంలో అంతర్భాగం… పాట లేనిదే నేను లేను అనడం ఏ మాత్రం అతిసయోక్తి కాదు… నా దినచర్య పాటతో ప్రారంభం అవుతుంది, పాటతో ముగుస్తుంది… నా సంతోషంలో పాట ఉంటుంది, నా దుఖంలో పాట ఉంటుంది… పాట వింటూ గెంతులు వేస్తాను, పాట వింటూ ఏడుస్తాను… పాట మొదలవ్వకుండా నా కారు కదలదు… నా కారు స్పీడు కూడా నేను వినే పాట స్పీడు బట్టి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు…

చిన్ననాటి నుండే పాట మీద మక్కువ… పెరిగిన వాతావరణం అయ్యుందొచ్చు, నాలో అంతర్లీనంగా ఉన్న స్రుజనాత్మకత అయ్యుందొచ్చు… స్కూల్లో ఉన్న రోజుల్లోనే జగదాంబా జంక్షన్లో ఇరవై రూపాయలు పెట్టి అరచేతిలో పట్టేంత చిన్న రేడియో కొనుక్కున్నా… ఆ ఇరవై రూపాయలు కూదా నేను గోళీలు (అల్లి కాయలు అనేవాళ్ళం) ఆడి గెలిచిన పైసలతో… రోజు స్కూలుకి ఇయర్ ఫోన్లు పెట్టుకొని ఆ రేడియోలో పాటలు వింటూ వెళ్ళడం పరిపాటి… ఇంట్లో టేప్ రికార్డర్ లేదు…సో, ఇంటి పక్కనే ఉన్న మా బడ్డీ శ్రీను కొట్లో, తర్వాత మా ఓనర్ వాళ్ళబ్బాయి కరిపి (ఆడు కర్ఫ్యూ రోజు పుట్టాడు.. పలకడం రాక అది కాస్తా కరిపి ఐపోయింది) గాడి దగ్గర పెద్ద స్పీకర్లతో సౌండ్ సిస్టంలో, మా బాబి గాడి ఇంట్లో హిందీ పాటలు, బాలాజి దగ్గర ఇళయరాజా పాటలు… ఇలా సాగుతూ ఉండేవి రోజులు…

కొన్నాళ్ళ తర్వాత మా నాన్న నా పోరు పడలేక ఇంట్లో టేప్ రికార్డార్ కొన్నాడు… అప్పుడే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను… యుక్త వయస్సు… అప్పుడు వచ్చింది గులాబి మూవీ… ఆ సినిమాలో ఏ రోజైతే చూసానో నిన్ను పాట… ఎంత నచ్చిందంటే ప్రతి సారి రివైండు చేసుకోడం దేనికని ఒక క్యాసెట్టుకి రెండు వైపులా అదే పాట రికార్డు చేయించేసుకున్నా… తర్వాత అంత నచ్చిన పాట సుస్వాగతం సినిమాలో ఆలయాన హారితిలో పాట…

ఇంజనీరింగ్ అయ్యింది, వైజాగ్లోనే చిన్న ఉద్యోగం జాయిన్ అయ్యా… నా మొదటి సంపాదనతో ఇంట్లో మంచి మ్యూజిక్ సిస్టం, టీవీ కొన్నా… (అవును, అప్పటి వరకు మా ఇంట్లో టీవీ లేదు)… అప్పట్లో SS మ్యూసిక్ అనే చానెల్ వచ్చేది… అప్పుడు చూసా స్నేహాని… ఆనందం అనే తమిళ్ సినిమాలో పాట.. లంగా వోని కట్టుకొని అచ్చమైన ఆరణాల తెలుగమ్మాయిలా ఎంతో నచ్చింది… ఆ ఇష్టం ఇప్పటికీ అలానే ఉంది అనుకోండి… ఆ చానెల్ వళ్ళ తమిళ్ పాటలు కూడా వినడం మొదలుపెట్టాను…

అలా జరుగుతున్న రోజుల్లో చక్రం చినిమా వచ్చింది… అందులో ఒకే ఒక మాట పాట… ఫస్ట్ టైం పాట ఎవరు రాసారు అన్న తలంపు వచ్చింది… సిరివెన్నెల గారు అని తెలిసింది… ఆయన మీద చాలా ఇష్టం ఏర్పడింది… అప్పటి నుంది సిరివెన్నెల గారి పాట అంటే అదో ప్రత్యేఖమైన అభిమానం…

బాలూ గారు అంటే తెలుసు, బాగా పాడతారని తెలుసు… కానీ, పాడుతా తీయగా కార్యక్రమం ఆయన గొంతుని కాకుండా మనిషిని పరిచయం చేసింది… ఆయన పాడడం చూస్తుంటే ఆహా అనిపించేది… బాలూ గారంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది… ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయిన రోజు చాలా బాధపడ్డా… వయసు రీత్యా అందరం వెళ్ళిపోతాం… కానీ ఆయన గొంతుకి అస్సలు వయస్సు అవ్వలేదు… అందుకనే చాలా బాధపడ్డా… ఐనా ఆయన కొన్ని వందల అద్భుతమైన పాటలు మనకి వదిలి వెళ్ళారు… ఆ పాటల రూపంలో ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు…

ఒక సారి, నేను మా బాబీ గాడు వైజాగ్లో ఒక బారుకి వెళ్ళాం… అక్కడ లైవ్ ఆర్కెస్ట్రా నడుస్తుంది… తాగుతూ వింటున్నాం… పరువమా, చిలిపి పరుగు తీయకే అని వినిపించింది… అంతే ఒక్కసారి మనసంతా ఆ పాట మీదకి వెళ్ళింది… ఫస్ట్ టైం వినడం… ఎంతో నచ్చింది… వాల్ల దగ్గరకి వెళ్ళి మళ్ళీ ఆ పాట పాడమని రిక్వెస్ట్ చేసుకొని పాడించుకున్నా… అలా ఇంకోసారి కూడా…

నాకు బాగా ఇష్టమైన పాటలు నాకు నచ్చిన కొంత మందికి డెడికేట్ చెయ్యడం ఒక సరదా… వాళ్ళమీద నాకున్న అభిమానం అలా వ్యక్తపరుస్తా…

ఇదీ, నా పాట గోల… ఎంతో ఉంది చెప్పడానికి… కానీ ఇలా క్లుప్తంగా ముగిస్తున్నా… 🙂

Comments

Leave a Reply