NENINTHE

Just the way I am

అమెరికా… ఆరాటం – పోరాటం

అమెరికా… బయట నుండి చూసే వాళ్ళకి ఇదొక భూతల స్వర్గం… వచ్చే ముందు అందరిది ఒకటే ఆలోచన… ఊరులో ఒక అపార్టుమెంటు, మంచి కారు, కొంత బ్యాంకు బ్యాలెన్సు… ఇవి సంపాదించుకున్నాక తిరిగి ఇండియా వెళ్ళిపోవాలి…

ఈ ఎజండాతో దిగుతాం… దిగిన దగ్గర నుండి దరిద్రానికి దగ్గరగా బతకడం మొడలెడతాం…😁😁 ఏది కొనాలన్నా ఇక్కడ ఏమి పెర్మనెంటుగా ఉండం కదా, అంత ఖరీదు పెట్టి కొనడం దేనికి… ఇదొక నిత్య సంఘర్షణ … ఇండియాలో ఒక మోస్తరుగా బతికినోళ్ళు కూడా ఇక్కడ దిగి దిగడంతోనే అహ నా పెళ్ళంటలో కోట శ్రీనివాసుకి దగ్గరగా బతకడం మొదలెడతారు..🤷🏻‍♂️. ప్రతీది రూపాయల్లో కన్వర్టు చేసుకొని అమ్మో ఇంత డబ్బులా అని పిల్లలకి సెకండు హ్యాండు బొమ్మలు, ఇంట్లోకి సెకండు హ్యాండు వస్తువులు ఇలా…  క్యాష్ ఎండ్ క్యారీ (హోల్ సేల్ షాప్ లెక్క) కి వెళ్ళి బస్తాల లెక్కన ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, టమాటాలు లాంటివి కొనుక్కొని అపార్ట్మెంట్లు అందరూ వాటాలు వేసుకొని పంచుకోవడం… పొదుపు మరి…😎 వచ్చిన కొత్తల్లో నేను ఒక సెకండు హ్యాండు సోఫా కొన్నా… ఇంటికి తీసుకొచ్చి క్లీను చేస్తుంటే ఆ సోఫా బొక్కల్లో ఆడి డాయరు… ఆ సోఫా మీద ఆడు ఏమేం పనులు చేసాడో చెప్పాల్సిన అవసరం లేదు…  🤣🤣

ఇవన్ని ఒక ఎత్తు అనుకుంటే మరో పక్క ప్రాజెక్టులు, H1 ఎక్ష్టెన్షనులు, ఇండియా వద్దామంటే సెలవులు, వీసా గోలలు… ఇదొక రామాయణం… చాలా మందివి కన్సల్టింగు బతుకులే కదా…  😒

ఇలా డబ్బు కోసం ఆరాటం, బ్రతుకు తెరువు పోరాటంలో తెలియకుండానే యేళ్ళు గదచిపోతాయి… పిల్లలు కూడా పెద్దోలవుతారు… ఇక్కడ స్కూళ్ళు బాగుంటాయి (అని సర్దిచెప్పుకుంటాం), ఆడుకోడానికి పెద్ద పార్కులు ఉంటాయి.. ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉందాం అని ఒక పురుగు పుడుతుంది… దానితో కుట్టించుకుంటూ ఇంకొన్నేళ్ళు… ఈలోగా పిల్లలు పిడుగుల్లా మారతారు… ఇండియా అంటే చీ పో మేము రామంటారు… అంతే… ఈ కురుక్షేత్ర యుద్దంలో పద్మవ్యూహం ఘట్టంలోకి వచ్చామని అర్ధం అవుతుంది… బయటకి పోలేము… బతకాలంటే యుద్దం చెయ్యాల్సిందే..  ఇంక చేసేదేమి లేదు… ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లల కోసం వాళ్ళ చదువుల కోసం ఉండి తీరాల్సిందే…

ఈ ప్రక్రియలో మనం కూడా ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది కదా అని ఇంకొక పురుగు… చుట్టూ ఉన్నోళ్ళు కొనుక్కుంటే మనకి నామోషి కదా…  పీర్ ప్రెషరు అన్నట్టు… ఇళ్ళు కొన్న దగ్గర నుండి మళ్ళీ కోట శ్రీనివాస రావు బయటకి వస్తాడు… మళ్ళీ మార్గదర్శిలో పొదుపు కార్యక్రమం మొదలు…

ఈ ప్రక్రియలో మనకి తెలియకుండానే చాలా కోల్పోతాం, నాలాంటోళ్ళు తల్లిదండ్రులతో సహా 😭😭😭… బంధువులు, బంధాలు, ఆప్యాయతలు… ఇవన్ని కేవలం మాటలకే పరిమితమైపోతాయ్…

దూరపు కొండలు నునుపు అంటారు కదా… చాలా మందికి ఆళ్ళకేమి అమెరికాలో సుఖంగా ఉన్నారు అనుకుంటారు… అమెరికాలో ఉన్నాం, కానీ ఇక్కడ ఉన్న చాలా మంది సుఖంగా ఉండరు… ఇది సత్యం… ఎప్పుడూ సంఘర్షణే ఇక్కడ… ఈ త్రిశంకు స్వర్గంలో  అలా కొట్టుమిట్టాదుతూ కాలక్షేపం చేస్తాం…

సూక్షంగా ఇది సగటు దేశీ గాళ్ళ అమెరికా బ్రతుకులు… వీటిలో కొన్ని స్వయం అనుభవాలు, కొన్ని చూసిన అనుభవాలు… అందరూ ఇలానే ఉంటారు అని చెప్పను కానీ నేను చూసిన చాలా మంది ఈ కోవలోనే నడిపించు నా నావా, నడి సంద్రమున దేవా అనుకుంటూ జీవన యానం సాగిస్తుంటారు…

Comments

Leave a Reply